Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 8:36 pm Posted by : ramakrishna

ఎన్ పిడిసీఎల్ లో అత్యధిక విద్యుత్ గరిష్ట డిమాండ్

 

. . . శనివారం 6057 మెగావాట్ల నమోదు

 

. . . వేసవి ప్రారంభం కు ముందే అత్యధిక విద్యుత్ వినియోగం

 

వరంగల్, బతుకమ్మ :

 

ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు శనివారం నమోదయ్యింది. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ట డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఫిబ్రవరి లోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో సత్వర చర్యలు చేపట్టినట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్ లో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ముందస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 35 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఛార్జ్  చేశామని, 366 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని 7600 ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్య పెంపు చేపట్టామని,  ఓవర్‌లోడ్ ఉన్న 33 కెవి 8 ఫీడర్ల ను విభజన చేశామని, 1200 కిలో మీటర్ల మేర 33 కెవి   ప్రత్యామ్నాయ (ఆల్టర్నేట్) లైన్లు ఏర్పాటు చేశామని వివరించారు. లో వోల్టేజి తగ్గించడానికి 392 కెపాసిటర్ బ్యాంకులు పెట్టామని చెప్పారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపట్టడం జరిగిందని తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ల  నిర్వహణ, లైన్ల పర్యవేక్షణ, లూజ్ లైన్ కనెక్షన్లలు సరిదిద్దడం, అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచడం వంటి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు.

 

Highest peak demand for electricity in NPDCL

 

ప్రతి డివిజన్‌లో అత్యవసర స్పందన బృందాలను సిద్ధంగా ఉంచి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని,  వేసవికాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని సీఎండీ పేర్కొన్నారు. రైతులకు ఈ సీజన్ సంబంధించి పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని, అందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. సంబంధిత సీజన్లో  రైతులకు విద్యుత్తును నిరంతరాయంగా అందజేస్తామని తెలిపారు.

 

Highest peak demand for electricity in NPDCL