. . . 49 కుటుంబాల సామాజిక బహిష్కరణ
. . . జిల్లా పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
ఏర్గట్ల, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన 39 గౌడ కుటుంబాలను, 10 దళిత కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సామాజికంగా బహిష్కరణ చేసింది. ఈ విషయం బాధితులు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సాంఘిక గ్రామ బహిష్కరణ చేశారని జిల్లా పోలీసు కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో విన్నవించుకున్నారు. గ్రామం మొత్తం మంగళవారం నాటి నుంచి బహిష్కరణ చేసిన కుటుంబాలకు సహాయ నిరాకరణ చేస్తూ, ఎవరు కూడా మాట్లాడకుండా గ్రామంలో గల కిరాణా కొట్టులలో సరుకులు ఇవ్వకుండా గ్రామ అభివృద్ధి కమిటీ ఆంక్షలు విధించిందన్నారు. ఎవరైనా వారు చెప్పిన మాటను వినకుండా వారితో మాట్లాడినా, సరుకులు ఇచ్చిన వారికి 25 వేల రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆదేశించారు. గ్రామాభివృద్ధి కమిటీ వారు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని కమీషనర్ కి తెలియజేశారు. ఈ గ్రామ బహిష్కరణకు ప్రధాన కారకులు, గ్రామ అభివృద్ధి కమిటీ బాధ్యులతో పాటు, ఆవుల దేవన్న, ఇట్టేడి రాజకుమార్ రెడ్డి, నాగులపల్లి అంజిరెడ్డి, క్యాతం దేవేందర్, క్యాతం గంగాధర్ తుమ్మల ఆనంద్, తమ్మడి రాజేష్, పోతుగంటి ఊషన్న పలువురు ఉన్నారని ఫిర్యాదులో విన్నవించుకున్నారు. బహిష్కరణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి వారిపై చర్యలు తీసుకొని మళ్లీ గ్రామంలో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ తాళ్ళరాంపుర్ బాధిత గౌడ కుటుంబాలు బాధిత, దళిత కుటుంబాలు వారు వాపోయారు.
ఏడాదిలో రెండవసారి. . . జిల్లా జడ్జి చట్టంపై అవగాహన కల్పించిన వెనక్కి తగ్గని వీడీసీ
ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై సామాజిక బహిష్కరణ విధించడం సర్వసాధారణమైంది. కల్లుగీత వృత్తిని కలిగిన గౌడ కులస్తులు ఊరి మీదకు (వీడీసీ)కి ఏడాదికి కొంత మొత్తం పేరిట డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అయితే గౌడ కులస్తులు వీడీసీకి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇది వరకు గతేడాది కూడా సామాజిక బహిష్కరణకు గురి చేశారు. వారితో పాటు కల్లుగీత వృత్తిని చేస్తున్న దళిత కుటుంబాలను కూడా వీడీసీ సామాజిక బహిష్కరణకు గురి చేసింది. గతేడాది వీడీసీ నిర్వాకంపై పోలీసులు కేసు నమోదు చేయగా జిల్లా న్యాయమూర్తి స్వయంగా తాళ్ళరాంపూర్ లో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్టాన్ని చేతులోకి తీసుకుంటే కఠిన శిక్షలు తప్పవని వీడీసీకి మందలించారు. అయినప్పటికీ వీడీసీ మరోసారి సామాజిక బహిష్కరణ చేయడం చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని చేతులోకి తీసుకున్న వీడీసీపై, ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.