వేల్పూర్, బతుకమ్మ :
వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన రేగుల రిషిక, రెండో స్థానంలో నిలిచిన మానేపల్లి శ్రీనిజ, మూడో స్థానంలో నిలిచిన సేరు అనన్యలకు నగదు ప్రోత్సాహకాలు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా విద్య, వైద్య రంగాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యే నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే, వారి విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందించేందుకు తమ సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాజశ్రీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.