. . . సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
. . . హెల్ప్ డెస్క్ కేంద్రం ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్.ఐ.ఆర్)కు సంబంధించి ఓటర్లకు సహకరించేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఒక్కో సర్కిల్ వారీగా ఈ హెల్ప్ డెస్క్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, ఓటర్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటేశ్వర్ జోన్-4 కార్యాలయంలో కొనసాగుతున్న హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, వివరాల నమోదు విషయంలో ఓటర్లకు ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు.

ఓటర్ల వివరాలను ఎలా చెక్ చేస్తున్నారు, ఏయే అంశాలను పరిశీలిస్తున్నారు తదితర వివరాలను హెల్ప్ డెస్క్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియకు ప్రతి ఓటరు సహకరించాలని సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి, నిర్ణీత గడువులోపు బూత్ లెవెల్ అధికారులకు అందించాలని సూచించారు. గడువు పొడిగింపు అంశం జిల్లా యంత్రాంగం పరిధిలో లేనందున, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు లోపు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫారంను నింపి బీ.ఎల్.ఓలకు అందించాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఆగస్టు 5వ తేదీన ప్రచురించబడే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు కోల్పోతారని అన్నారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. బీ.ఎల్.ఓలతో పాటు ఏఈఆర్ఓ లు, ఈ.ఆర్.ఓలను కూడా సంప్రదించవచ్చని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 95శాతం ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయ్యిందని, నిజామాబాద్ నగరంలో 65 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ తెలిపారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఓటరు గడువులోపు ఫారంలు పూరించి బీ.ఎల్.ఓలకు అందించాలని అన్నారు. మ్యాపింగ్ చేసుకోని వారితో పాటు ఇంతకుముందే మ్యాపింగ్ అయిన వారు కూడా తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలను నింపి బీ.ఎల్.ఓకు అందించాలని సూచించారు. ఆన్లైన్ లో ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా కూడా ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవచ్చని అన్నారు. కాగా, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు సరిగా లేని వారికి సైతం ఈ నెల 24వ తేదీ అనంతరం ఈ.ఆర్.ఓలు నోటీసులు అందించి హియరింగ్ నిర్వహిస్తారని, సంబంధిత ధృవీకరణ పత్రాలు పరిశీలించి అర్హత కలిగిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు ఆయా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల నుండి బీ.ఎల్.ఏలు ప్రతి రోజు 50 వరకు ఎన్యూమరేషన్ ఫారంలు సేకరించి బీ.ఎల్.ఓలకు అందించవచ్చని అన్నారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
