Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 5:57 pm Posted by : ramakrishna

ఉక్కపోత… నీళ్లులేక..

  • మధ్యాహ్నం నుంచే ఖాళీ
  • తాగేందుకు నీళ్ల కోసం ఆరాటం
  • విధిలేక కొనుగోలు
  • ఏర్పాట్లపై విమర్శలు

నిజామాబాద్, బతుకమ్మ:  రైతుల ఉపయోగార్థం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం విమర్శలను మూట గట్టుకుంటోంది. భానుడి ప్రతాపం రోజురోజుకి ఎక్కువవుతున్న దరిమిలా  ప్రదర్శన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అని చెప్పారు. పదేళ్లుగా ప్రదర్శన జిల్లాలో ఏర్పాటు చేయబడలేదు.  కొన్నేళ్ల తర్వాత రైతు మహోత్సవం రావడంతో దీనికి వివిధ గ్రామాలు, జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

  • సేదకై శిబిరాలు లేక…

అనుకున్నట్లుగానే ఉదయం వేళ రైతులు అధిక సంఖ్యలో ఉన్నా… మధ్యాహ్నం నుంచి ఇంటి బాట పట్టారు. సందర్శకులు వచ్చే ప్రధాన ద్వారం నుంచి వేదిక ముందు వేసిన గుడారం వరకు ఎండలోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కూర్చోవడానికి ప్రత్యేక సౌకర్యాన్ని, అలసిన వారు సేద తీరేందుకు  కొన్ని ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేయించలేదనే విమర్శలు రైతుల నుంచి వచ్చాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు ప్రదర్శన ఉండేలా చూస్తే రైతులకు వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • నీటి వసతి లేక..

దాహం తీర్చుకునేందుకు నీళ్ల వసతి కనుమేరల్లో కనిపించకపోవడంతో నీటి కోసం సందర్శకులు అల్లాడడం కనిపించింది. నీళ్లు ఎక్కడ ఉన్నాయని అడిగితే వెనుక భోజనాల కోసం వేసిన గుడారంలో అని చెప్పడంతో అటు వైపు వెళ్లారు. తాగునీరు అందించేందుకు ప్రత్యేక వాలంటీర్లు లేకపోవడంతో దాహర్తిని తీర్చుకునేందుకు తిప్పలు పడ్డారు. చల్లదనం కోసం విజయ డెయిరీలో ఉన్న మజ్జిగను కొనుగోలు చేయగా, రెండు సార్లు తెప్పించాం అయిపోయాయి, మళ్ళీ తెప్పిస్తున్నామని చెప్పడం గమనార్హం.

  • అదునాతన యంత్రాలు రాక..

రైతులను యాంత్రికరణ దిశగా తీసుకెళ్తామని రైతు మహోత్సవం ఆరంబానికి వచ్చిన అమాత్యులు చెప్పారు. ప్రదర్శనలో మాత్రం  అదునాతన యంత్రాలు లేకపోవడం గమనార్హం. చిన్న, సన్న కారు రైతులు సాగు చేసుకునే విధంగా ఉపయోగపడే పరికరాలు, యంత్రాలు ఉంటాయని ఆశతో  వచ్చిన రైతులకు నిరాశనే ఎదురయ్యిందన్నట్లు కనబడింది.

Heatstroke... no water..