నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణలో బీసీ 42% రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పలు అంశాలు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన నోటిఫికేషన్ కాపీ కోర్టుకు అందజేశారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారం మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. బుధవారం తుది తీర్పు వెలువడుతుందన్న వారికి నిరాశ ఎదురయింది. గురువారం మధ్యాహ్నం వరకు వాదనలు పూర్తి అయితే సాయంత్రానికి తీర్పు వస్తుందో లేదా మళ్లీ వాయిదా పడుతుందా అన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. మరోపక్క ఎన్నికల సంఘం గురువారం తుది నోటిఫికేషను విడుదల చేయాల్సి ఉండగా హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకు వేచి చూస్తుందా లేక తదుపరి నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ల అంశంపై మరో 24 గంటలు దాటితే తప్ప స్పష్టత వచ్చే పరిస్థితి లేదు.