. . . 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక సిద్దం
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెలలోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించాలన్నారు. ప్రత్యేక వైద్య నిపుణులైన, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఛాతి వైద్య నిపుణులు, క్యాన్సర్ రోగుల కోసం అంకాలజిస్ట్, కంటి వైద్య నిపుణులు, చర్మ వ్యాధి నిపుణులు, మానసిక వ్యాధి నిపుణులు తో పాటు స్త్రీ వైద్య నిపుణులు, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడతాయని అన్నారు. ఈ స్పెషాలిటీ వైద్య నిపుణులు జిల్లాలోని 38 ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మందు జాగ్రత్త లో భాగంగా 14 సంవత్సరాల వయస్సు కిశోర బాలికలకు హెచ్ పీవీ టీకాలను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రారంభించబడుతుందన్నారు. జిల్లాలో 30 సంవత్సరాలు పైబడిన అందరికీ జీవన శైలి వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ముందస్తుగా నిర్వహిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ నియమ నిబంధనలకు అనుగుణంగా లోటుపాట్లను సవరించుకుంటూ, అనుభవంతో కూడిన నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులు, పనికిరాని చెత్త నివారణ చర్యలను చేపట్టాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య కేంద్రాల స్థిర, చర ఆస్తుల నిర్వహణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా నూతనంగా నిర్మించబోయే ఆరోగ్య కేంద్రం కోసం అవసరమైన ల్యాండ్ ను గుర్తించాలన్నారు. మానసిక ఒత్తిడి అనేక రుగ్మతలకు, వ్యాధులకు కారణం అవుతున్నందున ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడినీ వివిధ జీవనశైలి మార్పులతో తగ్గించుకోవాలన్నారు. అదే విధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను ఆన్లైన్లో నమోదు చేసి డిజిటల్ రిపోర్టింగ్ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ 99 రోజుల కార్యక్రమాల్లో ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్య వారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 6న ఆహార పదార్థాల నాణ్యత, సరియైన పోషకాహారాన్ని తీసుకునేలా ఈట్ రైట్ పై అవగాహన కలిగించడం, ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన వైద్యులకు వైద్య సిబ్బందికి బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 8న హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన, నిర్ధారణ పరీక్షల శిబిరాలని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 9న మహిళలు, తల్లుల సంరక్షణపై కార్యక్రమాలు, ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 11 న ఔషధ నియంత్రణ, రెగ్యులేటరీనీ బలోపేతం చేయడం పై కార్యక్రమం ఉంటుందన్నారు. హెచ్ పీవీ టీకాల పంపిణీ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఆరోగ్య సేవలు అన్నింటిని డిజిటల్ రిపోర్టింగ్ చేయడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులోని మహిళలందరికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మానసిక ఒత్తిడిలో ఉంటూ పరీక్షలు అంటే భయపడుతూ ఇతర మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థులు యువకులు, అందరినీ దృష్టిలో ఉంచుకొని మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ కొరకు టెలి మానస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, ముఖ్యంగా విద్యార్థులకు ఎటువంటి మానసిక సమస్యలున్న 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్ ని సంప్రదించి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చని అన్నారు. ఈ టెలి మానస్ స్టిక్కర్లను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో అతికించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమినైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాలనాధికారి సుమంత్ కుమార్, ఉపవైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సమత, డాక్టర్ అశ్విని, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శిఖరా, డాక్టర్ దివ్య, డాక్టర్ చైతన్య, డాక్టర్ అవంతి, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రావ్య, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డిపిఓ విశాల, డిడిఎంలు నారాయణ, పృధ్వీ, క్వాలిటీ మేనేజర్ రాము, పీఎంఓ రూప, ఫార్మసీ అధికారి నారాయణ, ఎన్ హెచ్ ఎం అకౌంట్స్ అధికారి సందీప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.