Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:47 pm Posted by : ramakrishna

నకిలీ క్లినిక్‌లపై వైద్యశాఖ ఉక్కుపాదం

 

. . . నాలుగు క్లినిక్ లను సీజ్ చేసిన అధికారులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్‌లపై జిల్లా వైద్యశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‌లను అధికారులు గురువారం సీజ్ చేశారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశాల మేరకు వైద్యురాలు సుప్రియ నేతృత్వంలోని వైద్యశాఖ బృందం నగరంలోని నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు క్లినిక్‌లను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న నాలుగు క్లినిక్‌లను గుర్తించి సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల సమాచారం ప్రకారం, గతంలో స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లాలో పీఎంపీ, ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హతకు మించి వైద్యం చేయడం, యాంటీబయాటిక్ మందులను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడం వంటి అంశాలను గుర్తించిన కౌన్సిల్ సభ్యులు సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం వారిపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశారు. మెడికల్ కౌన్సిల్ నుంచి అందిన ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ తాజా చర్యలకు దిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగో టౌన్ ఎస్‌ఐ కరీం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది క్లినిక్‌ల వద్దకు చేరుకుని సీజ్ నోటీసులను అతికించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు రామకృష్ణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం, అర్హతకు మించి చికిత్స చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా వైద్యశాఖ హెచ్చరించింది. ప్రజలు చికిత్స పొందే ముందు సంబంధిత వైద్యులు, క్లినిక్‌లకు అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించింది.