Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:55 pm Posted by : ramakrishna

ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కోట గల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ భాస్కర్ తెలిపారు. ముఖ్యంగా కంటిచూపు సమస్యలు, చర్మం, చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందించడం ఆర్బిఎస్కే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో చికిత్స సాధ్యం కాని కేసులను హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు రిఫర్ చేసి మెరుగైన వైద్యం అందిస్తామని డాక్టర్ భాస్కర్ తెలిపారు. విద్యార్థులకు హెల్త్ కార్డులు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత వారం జిహెచ్ఎస్ శంకర్ భవన్ హైస్కూల్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో సుమారు 40 మంది విద్యార్థులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని, ఒక సర్జరీ అవసరమైన కేసును గుర్తించి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, ఆర్బిఎస్కే సిబ్బంది, ఉపాధ్యాయులు దయానంద్, నందిని, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.