. ఎకరానికి ఆరు క్వింటాళ్ల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయాను కోనుగోలు చేయాలి
. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో మంత్రుల రివ్యూ మీటింగ్ ఉన్నట్లు ఈ రోజే(శుక్రవారం) సమాచారం ఇచ్చారని, తాను రావొద్దనే ఉద్దేశంతోనే ముందుగా తెలుపలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఎకరానికి ఆరు క్వింటాళ్ల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయాను ఎంఎస్ పీ ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రివ్యూ ద్వారా ప్రభుత్వం దృష్టికి తాను తీసుకెళ్లాలనుకున్న సోయా అంశంతోపాటు ఇతర డిమాండ్ లపై ఆయన వీడియోలో మాట్లాడారు. ప్రభుత్వమే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయాలని గత వారం తాను డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం ఎకరానికి 6 క్వింటాళ్ల మాత్రమే తీసుకుంటామంటోందని అన్నారు. మిగతా పంటను విక్రయించుకునేందుకు రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారుల చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో లక్షా 30వేల ఎకరాల్లో (కామారెడిడ జిల్లాలో 90వేలు, నిజామాబాద్ లో 40వేల ఎకరాలు) సోయా సాగైనట్లు తెలిపారు.