. . . భయాందోళనలో వాహనదారులు
ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రం నుంచి బట్టపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రమాదకర చెట్లు వాహనదారులు, స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో రహదారికి ఇరువైపులా నాటిన చెట్లలో కొన్ని ప్రస్తుతం గాలులు, వర్షాల కారణంగా విరిగిపడే స్థితికి చేరుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుకు ఆనుకుని ప్రమాదకరంగా వంగి ఉన్న చెట్ల వద్దకు చేరుకున్న ప్రతిసారీ వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు చెట్లు ఎప్పుడు విరిగి పడతాయోనన్న భయంతో వాహనాలను ఆపి, పరిస్థితిని గమనించిన తర్వాత మాత్రమే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకర స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే వాహనాల రాకపోకల సమయంలో చెట్లు అకస్మాత్తుగా విరిగిపడితే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి ప్రమాదకర చెట్లను తొలగించి, బట్టపూర్ – ఏర్గట్ల రహదారిపై ప్రయాణం సురక్షితంగా ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
