బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో బుధవారం గురు స్వాములు నాగభూషణం స్వామి , సంగ్రామ్ స్వామి , రాజేశ్వర్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాముల సామూహిక మహా మండల పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది . ధర్మారం హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు ధర్మారం చౌరస్తా వద్ద వీరికి ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం చౌరస్తా నుండి ధర్మారం గ్రామం వరకు బైక్ ర్యాలీతో వెళ్లారు . గ్రామంలో మహిళలు హారతులతో వీరికి ఘన స్వాగతం పలికారు . అనంతరం వీధుల గుండా భక్తి పాటలతో ఊరేగింపు నిర్వహించారు . హనుమాన్ సామూహిక మహా మండల దీక్ష కార్యక్రమంలో భజనలు , భక్తి పాఠాలు ఆకట్టుకున్నాయి . జుక్కల్ నియోజకవర్గంలోని హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ నామస్మరణ చేశారు . ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు భక్తి పాటలతో అంగరంగ వైభవంగా సాగింది . ఈ సందర్భంగా నాగభూషణం స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని , భగవంతుని నామస్మరణతోనే అంతా శుభం జరుగుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.
