నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్ పిడీసీఎల్) ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఉపకేంద్రానికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్) చౌహాన్ జైవంత్ రావు, జిల్లా ఎస్‌ఈ (ఆపరేషన్) పీవీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. ఉపకేంద్రంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని నిర్ధారించిన అనంతరం దీనిని టెక్నికల్ చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ, హనుమాన్ ఫారం విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో పోతంగల్, హనుమాన్ ఫారం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. ఈ ఉపకేంద్రం ప్రారంభం ద్వారా స్థానిక విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయ అవసరాలకు, గృహ వినియోగానికి మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఆపరేషన్ పీవీ రాజేశ్వరరావు, డీఈ ఆపరేషన్ నిజామాబాద్ ఎం. శ్రీనివాస్ రావు, డీఈ ఎంఆర్‌టీ/కన్స్ట్రక్షన్ డి. వెంకటరమణ, ఈఈ సివిల్ స్వామి, ఏఈడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏఈడీఈ ఆపరేషన్ జి. ప్రశాంత్ రెడ్డి, ఏఈడీఈ టీఆర్‌ఈ నిజామాబాద్ కె. నటరాజ్, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ ఏ. కాశీనాథ్, ఏఈ ఆపరేషన్ నవీపేట్ ఆనంద్, జనపెళ్లి జి. శ్రీనివాస్, ఏఈ ప్రొటెక్షన్ నిజామాబాద్ భాస్కర్ ప్రసాద్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ నాయక్, ఎంఆర్‌టీ స్థానిక ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
