Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:00 pm Posted by : ramakrishna

ఆహార కల్తీపై వంద రోజుల్లో హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం !

 

. . . సిటీ పరిధిలో 185 కేసులు

 

. . . 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాజధానిలో ఆహార కల్తీపై పోలీసుశాఖ సమరశంఖం పూరించింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే నిశ్శబ్ద ముప్పుపై  హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ (హెచ్-ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న శంఖారావం పూరించిన ఈ ప్రత్యేక విభాగం . . . జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఆహార కల్తీపై రాజీలేని సమరం సాగిస్తుంది.

 

H-FAST cracks down hard on food adulteration within 100 days!

 

. . . వంద రోజుల హెచ్‌-ఫాస్ట్‌ దాడుల్లో విస్తుపోయే నిజాలు

టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బందితో నిరంతరం పనిచేస్తున్న హెచ్‌-ఫాస్ట్‌ విభాగం.. క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే.. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44,సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి.

 

H-FAST cracks down hard on food adulteration within 100 days!

 

నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు) 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు) సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు) 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు)1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు)ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు,బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి.

 

H-FAST cracks down hard on food adulteration within 100 days!

 

. . . 247 కేసులు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ

పోలీసు చర్యలతో పాటు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు  తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు,మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్‌పై 3 కేసులు దాఖలయ్యాయి.

 

H-FAST cracks down hard on food adulteration within 100 days!

 

. . . ఫుడ్ వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు

కల్తీ నియంత్రణతో పాటు నివారణ చర్యలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తదితర తయారీ కేంద్రాలకు చెందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారం పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పద్ధతులను ఏమాత్రం సహించబోమని వారికి నిర్మొహమాటంగా స్పష్టం చేస్తూ, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను ప్రత్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా గానీ ఫుడ్ బిజినెస్ తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రు విధిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు. కల్తీ నిరోధంలో భాగంగా వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సిబ్బంది గ్లౌజులు,మాస్కులు ధరించడం, నిల్వల్లో పాత నిల్వలను కొత్త నిల్వలను కలపకుండా ప్రాసెసింగ్ పద్ధతిని పాటించడం, హోటళ్లలో వాడిన నూనెను పదే పదే వాడకుండా జాగ్రత్తపడడం వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆహార కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

 

H-FAST cracks down hard on food adulteration within 100 days!