సీపీఐ(ఎం. ఎల్)మాస్. లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయకార్యదర్శి ఆర్.రమేష్
దర్పల్లి, బతుకమ్మ : ఎన్నికల్లో వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యాలని సీపిఐ(ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు.శనివారం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపీకేఎంఎస్) ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు ఇచ్చిన రూ. 12 వేల భృతి అమలుకై మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలపుకొని 12వేల జీవనభృతి అమలు చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.వీరికి ఏడాది పొడవున వ్యవసాయంలో పని దొరకటం లేదని, పని దొరికిన దినాలలో తక్కువ ఆదాయం వస్తుందని దీనివలన విద్య, వైద్యం, తలదాచుకోవడానికి గూడు లేక జంతువుల మాదిరిగా బతుకుతున్నారని అన్నారు. పుట్టిన పిల్లలకు పౌష్టిక ఆహారం లేక తగినంత బరువు లేక శరీరంలో కావాల్సిన రక్తం లేక వారి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ధనిక రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అన్న కేసీఆర్ తన పాలనలో వ్యవసాయ కూలీలకు చేసింది శూన్యమేనని దేశవ్యాప్తంగా 14 కోట్ల వ్యవసాయ కూలీలకు కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ పాలనలో వ్యవసాయ కూలీలకు చేసింది ఏమీ లేదన్నారు.ఒకరిపై ఒకరు చమత్కారాలు చేలోక్తులతో కూలీలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకి రూ.4000 పెన్షన్ ఇస్తానన్న హామీ ప్రకారం అంటే సంవత్సరానికి 45 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. తక్షణమే వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐకేఎంఎస్ ) జిల్లా నాయకులు ఈ.రమేష్, సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ భీంగల్ మండల కార్యదర్శి కే.రాజేశ్వర్ లు ప్రసంగించగా ఏ ఐ పీ కే ఎం ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి.బాబన్న, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) డివిజన్, మండల నాయకులు ఆర్.దామోదర్, ఎం.లింబన్న, ఎస్.కిషోర్,ఓ.ఆశన్న,ఎస్.బాల్ రాజ్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనిస్, మండల నాయకులు ఎం.హరీష్ తదితరులు పాల్గొన్నారు.