Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:20 pm Posted by : ramakrishna

ఎల్లయ్య చెరువు పూడికతీతతో పెరిగిన భూగర్భ జలాలు

 

. . . టీచర్స్ కాలనీ వాసుల హర్షం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఎన్నో దశాబ్దాలుగా పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిన ఎల్లయ్య చెరువు ఇటీవల చేపట్టిన పూడికతీత పనులతో జలసిరితో కళకళలాడుతోంది. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో టీచర్స్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 75 ఏళ్లుగా పూడికతీతకు నోచుకోని ఎల్లయ్య చెరువులో పూడికతీత పనులు చేపట్టడం వల్ల చెరువుకు కొత్త రూపు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తీసుకున్న నిర్ణయంతో చెరువు అభివృద్ధి సాధ్యమైందని వారు తెలిపారు. చెరువు పూడికతీత పనులు పూర్తవడంతో వర్షపు నీటిని అధికంగా నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడిందని, తద్వారా భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీచర్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో బావులు, బోర్లలో నీటి లభ్యత మెరుగుపడుతున్నట్లు చెబుతున్నారు. చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల రైతులు, పశువులు, పరిసర ప్రాంతాల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు పేర్కొన్నారు. నీటి సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పనులు దోహదపడతాయని తెలిపారు. పూడికతీత పనుల సమయంలో కొందరు అనవసర వివాదాలు, అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజాహితమే లక్ష్యంగా పనులు పూర్తిచేయడం అభినందనీయమని స్థానికులు అన్నారు. చెరువు బాగుంటే గ్రామం బాగుంటుంది అనే నానుడికి ఎల్లయ్య చెరువు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటూ, చెరువు అభివృద్ధికి కృషి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజ్, స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ ఖాలెక్ కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.