- సీఎంను కోరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోమన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ఫండ్స్ రూ.౩౦౦ కోట్లు మంజూరు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. తెలంగాణ సెక్రటేరియట్ నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా – ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టం, ఆస్తి నష్టం అంశంపై ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కేబినెట్ మంత్రులు ప్రత్యక్షంగా హాజరుకాగా, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు(ప్రధాన కార్యదర్శులు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మదన్ మోహన్ తమ నియోజకవర్గంలో వచ్చిన నష్టాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట నష్టాలు, రోడ్లు, చేరువులు, ఇల్లు, ప్రాజెక్టులు, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాలను స్పష్టంగా వివరించారు. తక్షణ పరిహార చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన మద్దతు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో భారీ వర్షాలకు, వరదలకు జరిగిన నష్టం పై పూర్తి నివేదిక అందించారు.
