Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 5:57 pm Posted by : ramakrishna

కేకేవై జాతీయ రహదారికి తక్షణం ఆమోదం తెలుపండి

 

. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కరీంనగర్ – సిరిసిల్ల – వేములవాడ – కామారెడ్డి – ఎల్లారెడ్డి – పిట్లం వరకు ఉన్న సుమారు 165 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ఢిల్లీ లోని వారి కార్యాలయంలో సోమవారం కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడంతో పాటు మహారాష్ట్రతో అనుసంధానం మరింత బలపడుతుందని వివరించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా కేకేవై రహదారి అంశంపై ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ కి కూడా వినతి పత్రం అందచేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా కేకేవై రహదారి అంశంపై ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లాలని ఎంపి సురేష్ షెట్కార్ ని కోరారు. కేకేవై జాతీయ రహదారి మంజూరు చేయాలని ఎంపి కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి వినతి పత్రం అందచేశారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా పరిశీలనలు పూర్తయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం ప్రతిపాదన ఎదురుచూస్తోందని తెలిపారు. ప్రతిపాదిత జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 563 (కరీంనగర్), ఎన్‌హెచ్ – 44 (కామారెడ్డి), ఎన్‌హెచ్ – 765డీ (ఎల్లారెడ్డి), ఎన్‌హెచ్ – 161 (పిట్లం)లను అనుసంధానించే కీలక కారిడార్‌గా మారుతుందని తెలిపారు. ఈ మార్గం ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరుకు రవాణా, వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు, పర్యాటకం మరియు వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చేరుకోవడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించిందని, అనంతరం అవసరమైన సాంకేతిక నివేదికలు, గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్, ఇతర వివరాలు సమర్పించామని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2022లో, రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి 2024లో కూడా ఈ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని వినతిపత్రంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు తక్షణ ఆమోదం తెలిపి,కరీంనగర్–పిట్లం 165 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేసి, పరిపాలనా, ఆర్థిక అనుమతులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ని కోరారు.