Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 9:28 pm Posted by : ramakrishna

లింగంపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు

 

. . . కనులపండువగా అమ్మవారి కళ్యాణం, అన్నదానం

 

. . . శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు

 

. . . ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు

 

లింగంపేట, బతుకమ్మ

 

మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

. . . సందడిగా బోనాల ఊరేగింపు

సాయంత్రం 5:00 గంటలకు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఊరేగింపులో శివసత్తుల శివాలు, పోతరాజుల విన్యాసాలు, డీజే చప్పుళ్లు, యువత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపు అంతటా భక్తుల జయజయధ్వానాలతో లింగంపేట పులకించిపోయింది. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపు రాత్రికి పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుంది. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శెట్టిపల్లి సత్యం, ఉపాధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్, కోశాధికారి అనిల్ కుమార్, సంఘ ముఖ్య నాయకులు వెంకటి, కృష్ణయ్య, అశోక్, బాలయ్య, గౌతమ్ కుమార్,అనిల్, సురేష్, సాయిలు, నరేష్, తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముదిరాజ్ సంఘం ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.