నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న ఇప్పకాయల హరిదాసు స్వామీజీకి ఘన సన్మానం లభించింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం భాగ్యనగరంలోని శ్రీ సార్వత్రిక కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను సమాజ సేవకుడిగా అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు స్వీకరించిన ఇప్పకాయల హరిదాసు స్వామీజీ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ సన్మానం వ్యక్తిగతంగా తనకు దక్కిన గౌరవంగా భావించడం లేదని అన్నారు. ఇది ఒక సామాజిక సన్మానమని, ఆధ్యాత్మిక చింతనాపరుడిగా, సమాజ సేవకుడిగా తనను తీర్చిదిద్దిన అనేకమంది ప్రజలకు ఈ గౌరవం చెందుతుందని పేర్కొన్నారు. తన సేవా ప్రస్థానానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించి, సమాజ సేవలో ముందుకు తీసుకెళ్లిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు ఇప్పకాయల హరిదాసు స్వామీజీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో మరింతగా ముందుకు సాగుతూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, సామాజిక సేవకులు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.