Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:42 pm Posted by : ramakrishna

బదిలీపై వెళ్లున్న ఉద్యోగిని లలితకు ఘన సన్మానం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో గత 14 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట ఆరోగ్య సేవలు అందించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగిని లలిత బదిలీపై మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ, లలిత గ్రామ ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తూ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి కుటుంబానికి చేరువై ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, ప్రజల ఆదరణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా ఆమె నిలిచారని అన్నారు. వర్షాకాలంలో దోమల నివారణ, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, డ్రైనేజీలను శుభ్రంగా నిర్వహించడం, తాగునీటిని మూతపెట్టి నిల్వ చేయడం, ఆరుబయట మలవిసర్జన చేయకుండా ఉండడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఆహారాన్ని ఈగల నుంచి రక్షించడం వంటి అంశాలపై లలిత ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఆమె సూచనలను గ్రామ ప్రజలు నేటికీ పాటిస్తున్నారని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ, లలితను తమ కుటుంబ సభ్యురాలిగా భావించామని, ఆమె సేవలు భూంపల్లి గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆమె బదిలీ గ్రామానికి తీరని లోటని, ఎక్కడ పనిచేసినా ఇదే సేవా భావంతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునంద, ఏఎన్ఎం సంగీత, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొని లలితకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Grand felicitation for employee Lalitha on her transfer