Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 9:07 pm Posted by : ramakrishna

ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కు ఘనంగా వీడ్కోలు

 

. . . కలెక్టరేట్ లో అట్టహాసంగా సన్మాన మహోత్సవం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా విధులు నిర్వర్తిస్తూ, మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన ఎస్.కిరణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉద్యోగ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు. అదనపు కలెక్టర్ గా కిరణ్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు. ఎంతో సమర్ధత కలిగిన అధికారి పదవీ విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు. తన మొదటి పోస్టింగ్ భద్రాద్రి జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా ఇదివరకు కిరణ్ కుమార్ తో కలిసి పని చేశానని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను కలెక్టర్ గా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఆయన పదవీ విరమణ చేయడం కాకతాళీయం అన్నారు. ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉండే రెవెన్యూ శాఖలో డీఆర్ఓగా, అదనపు కలెక్టర్ గా ఎంతో సమర్థంగా విధులు నిర్వహించారని, ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రెవెన్యూ శాఖా పరమైన అంశాలలో ఒత్తిడికి గురి కాకుండా ఓపికతో బాధ్యతాయుతంగా పని చేశారని కొనియాడారు.

 

Grand farewell for retired Additional Collector

 

ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, ముప్ఫై సంవత్సరాలకు పైగా వివిధ హోదాలలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణలో నిమగ్నం కావాల్సి వస్తుందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుని మానసిక ప్రశాంతతతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు మాట్లాడుతూ, ఉన్నత హోదాలో కొనసాగినప్పటికీ ఉద్యోగాలతో కిరణ్ కుమార్ ఎంతో సౌమ్యంగా, స్నేహభావంతో మెలిగేవారని అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో అదనపు కలెక్టర్ గా తాను సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Grand farewell for retired Additional Collector