Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 5:04 pm Posted by : ramakrishna

ఘనంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని దుబ్బ చౌరస్తా వద్ద తిలక్ యూత్ ఆధ్వర్యంలో గురువారం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిలక్ యూత్ అధ్యక్షుడు తొందూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “స్వరాజ్యం నా జన్మహక్కు” అనే నినాదంతో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని కొనియాడారు. తన ఉద్యమాల ద్వారా ఆంగ్లేయులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉద్యమ నాయకుడిగా, గణేష్ నవరాత్రులను ప్రజా ఉద్యమంగా ప్రారంభించి హిందువులందరినీ ఏకం చేసిన జాతీయోద్యమ పితామహుడిగా తిలక్ సేవలను ఆయన స్మరించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచరెడ్డి శ్యామ్, బంటు గణేష్, తొందూర్ అశోక్, బంటు శంకర్ తదితరులు పాల్గొన్నారు.