Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:15 pm Posted by : ramakrishna

ఘనంగా ప్రజాకవి డాక్టర్ దాశరథి 101వ జయంతి వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలను బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో ఉన్న ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్‌లోని స్టడీ సర్కిల్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఈబీ అధికారి డి. సీతయ్య, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయికుమార్, అతిథిగా సిరిప లింగయ్య, ప్రజా కళామండలి కళాకారులు, రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఏఈ అంజా గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్, డి. సీతయ్య మాట్లాడుతూ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు 1925లో వరంగల్ జిల్లా మానుకోట ప్రాంతంలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు. ఆయన కవిగా, సినిమా రచయితగా, తెలంగాణ సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందించిన మహానుభావుడని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన కవిగా గుర్తింపు పొందడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు పురస్కారాలు అందుకున్నారని గుర్తు చేశారు. నిజాం పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా దాశరథి తన రచనలు, ఉద్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. నిజాంబాద్ జిల్లా జైలులో బంధించిన సమయంలో బొగ్గుతో గోడపై “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని రాసిన ఆయన తెలంగాణ పౌరుషానికి, సాహిత్య పోరాటానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. డాక్టర్ దాశరథి వంటి మహనీయుల త్యాగాలను విద్యార్థి లోకం గుర్తించాలని, వారి సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందాలని వక్తలు కోరారు. ఈ సందర్భంగా ప్రజా కళామండలి కళాకారుడు సిరిప లింగయ్య ఆలపించిన “ఈ సముద్ర గర్భం” పాట విద్యార్థులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసింది. అనంతరం “డాక్టర్ దాశరథి అమర్ హై” నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది.

 

Grand celebrations marking the 101st birth anniversary of 'People's Poet' Dr. Dasarathi.