Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:09 pm Posted by : ramakrishna

ఘనంగా బోనాల మహోత్సవం

 

. . . బోనాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

శ్రీ భూలక్ష్మీ మాత అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భూలక్ష్మీ మాత అమ్మవారికి బోనాల సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొని అమ్మవారికి బోనం ఎత్తి సమర్పించారు. బోనాల వేడుకల సందర్భంగా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, మంగళ వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలతో ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివసత్తుల పూనకాలు, గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణంగా మారింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, టీటీసీఎస్ టి రాష్ట్ర చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, స్థానిక కార్పొరేటర్ స్రవంతి రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే అభివృద్ధి కమిటీ సభ్యులు తోట గోపాల్, మిద్దె రవి, ఆకుల శ్రీశైలం తదితరులు హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ మహోత్సవంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Grand Bonalu Festival