భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మొదలు నుండి చివరి వరకు ఎలాంటి విగ్నలు కలుగకుండా, నిర్వీగ్నంగా ఉత్సవాల పరిసమాప్తి కోసం ఆలయ అర్చకులు ఘనంగా అంకురార్పణ కార్యక్రమంను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం శ్రీవారి గర్భలయంలో స్వామి వారికి ముందుగా విశ్వక్సెనా పూజను నిర్వహించి శ్రీవారి ఉత్సవమూర్తుల ను పల్లకిలో తీసుకువచ్చి కొండ కింద గల కల్యాణ మండపంలో ఉంచిన అర్చకులు పుణ్యాహవచనం, రక్షాబంధనంను నిర్వహించి, శ్రీమత్ భగవత్గీతను పారాయణం చేశారు. అనంతరం పుట్టమన్నును తెచ్చి అర్చకులు పన్నెండు మట్టి పాత్రల్లో మట్టి పోసి అందులో బీజాలను అలికారు. అలికిన బీజాలు మొలకత్తేలా వాటికి నీటిని పోసి మొలకేత్తే ప్రక్రియను నిర్వహించారు.విగ్రహ ప్రతిష్టలు, బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేదుకు గాను భగవంతుని స్వపనోత్సవ ప్రక్రియలో భాగంగా ఈ అంకురార్పణ కార్యక్రమం ను నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్తలు నంబి లింబాద్రి, నంబి పార్థసారథిలు తెలిపారు.
