Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 7:35 pm Posted by : ramakrishna

కల్లాలు దాటని ధాన్యం

. . . నామమాత్రంగా కొనుగోలు కేంద్రాల ప్రారంభం

. . . కాంటా వేసింది లేదు.. గింజ కొన్నదీ లేదు

. . . ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు

. . .కొనుగోలు కేంద్రాల్లో  ప్రారంభం కానీ ధాన్యం సేకరణ

రుద్రూర్, బతుకమ్మ :                                                                                                                                                                        

వానకాలం వడ్ల కాంటా పడడం లేదు. కల్లాలు దాటడం లేదు.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి మాత్రమే పరిమితమయ్యాయి. వడ్ల సేకరణ మొదలు కాకపోవడంతో ఏ రోడ్డు మీద చూసినా ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్లతో రహదారులన్నీ నిండిపోయాయి. రుద్రూర్ మండల కేంద్రంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి గత 15 రోజులు అవుతున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించడం లేదని రైతులు వాపోతున్నారు. వరి కోతలు పూర్తయ్యి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల ప్రారంభం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  పగలు, రాత్రుళ్ళు రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద రాశులుగా పోసిన ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు రోడ్లపైన, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం పూర్తిగా తడవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింది. దీంతో పండించిన పంటలకు కనీస మద్ధతు ధర కూడా దక్కుతుందో లేదోననే భయంతో తేమ పేరుతో ఇబ్బందులు పడేకన్నా ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకైనా ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయని రైతులు వాపోతున్నారు.

Grain that does not cross the grain

. . . దోచుకుంటున్న దళారులు

అకాల వర్షానికి పంటను నష్టపోయే బదులు ప్రైవేటుకు అమ్ముకోవచ్చనే ఆలోచనతో చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఇదే అదనుగా కల్లాలు, రోడ్లపై వాలుతున్నారు. సన్నరకం వడ్లను కూడా రూ.2వేల వరకే చెల్లించి రైతులకు నష్టం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి రూ.2,320, బి గ్రేడ్‌ రకానికి రూ.2300 చొప్పున దక్కుతుండగా.. దళారులు మాత్రం తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. రేవంత్‌ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు అదనంగా రూ.500 అందాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నా.. గింజ మాత్రం కొనడం లేదు. ఒక రైతు తన పొలంలో పంట కోయగానే టోకెన్‌ పొంది వరుస క్రమంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు సిద్ధం అవుతాడు. ఇదీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రక్రియ. టోకెన్‌ సిస్టంతో ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పైరవీలకు ఆస్కారం ఉండదు. కానిప్పుడు టోకెన్‌ సిస్టమే కనిపించడం లేదు. నిజామాబాద్‌ జిల్లాలో దాదాపుగా లక్షా 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పోగై ఉన్నట్లుగా తెలుస్తోంది. కామారెడ్డిలోనూ లక్షా మెట్రిక్‌ టన్నులు ధాన్యం రోడ్లపైనే పరుచుకున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించాలని రైతులు కోరుతున్నారు.

Grain that does not cross the grain