Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 3:48 pm Posted by : ramakrishna

ఎస్ హెచ్ జీలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మహిళా స్వయం సహాయక సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో కనీసం 270కిపైగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాలకు కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థినివిద్యార్థులు యూనిఫామ్ లు కుట్టే బాధ్యతలను, ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ పంప్ లు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వం మహిళలకు కేటాయిస్తూవారి అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. గత సీజన్ లో ఐకెపి మహిళా సంఘాల ద్వారా జిల్లాలో కేవలం 50 కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుత సీజన్ లో ఇప్పటికే 110 కేంద్రాల నిర్వహణకు ఎస్.హెచ్.జి గ్రూపులను గుర్తించామన్నారు. కొత్తగా కొనుగోలు కేంద్రాలు కేటాయించబడిన మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం సేకరణ, కేంద్రాల నిర్వహణపై సహకార సంఘాల బాధ్యులుసంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సంబంధించిన లారీల విషయంలో, అలాగే హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మెప్మా పీడీ రాజేందర్డీ, డీసీవో శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Grain purchase centers for SHGs