- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇంచార్జిలతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిపామని అన్నారు. అయితే పలు చోట్ల నాట్లు వేయడంలో ఆలస్యమైనందున ధాన్యం దిగుబడులు కొంత ఆలస్యంగా వస్తున్నాయని అన్నారు. దీనిని దృష్ఠ్టిలో పెట్టుకుని అలాంటి ప్రాంతాలను మినహాయిస్తూ, మిగితా చోట్ల రెండుమూడు రోజులలో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని అన్నారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, వెంటదివెంట ధాన్యం తరలింపు కోసం లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. మిల్లుల వద్ద దొడ్డు రకం ధాన్యం సైతం సకాలంలో అన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, ఒకవేళ ఎక్కడైనా ధాన్యం దిగుమతి చేసుకోకపోతే తమ దృష్టికి తేవాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ జరిగాక ట్రక్ షీట్లు వేగంగా తెప్పించుకుని ఓ.పీ.ఎం.ఎస్ ఎంట్రీలు చేయాలని సూచించారు. కాగా, జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని కలెక్టర్ సంఘాల ఇంచార్జిలను, కేంద్రాల నిర్వాహకులను అభినందించారు. మిగతా ధాన్యాన్ని సైతం పూర్తి స్థాయిలో సేకరించాలని అన్నారు. వచ్చే సీజన్ లో కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఇదే స్పూర్తితో ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించేలా ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.సీ.ఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
