Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:21 pm Posted by : ramakrishna

రోడ్డుపై ధాన్యం.. గాల్లో ప్రాణం

 

. . . ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు.

 

. . . రెండేళ్లలో 12 మంది మృత్యువాత

 

. . . రోడ్డుపై ఆరబోస్తే.. కేసులంటున్న పోలీసులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడకు చెందిన దేవిక రెడ్డి బైక్ పై ఇంటికి తిరిగి వస్తు వడ్లకుప్పను ఢీ కొని దుర్మరణం చెందింది. సోమవారం మోస్రా శివారులో ఈ ఘటన జరిగింది….

రోడ్ల పై ధాన్యం ఆరబెట్టడం సర్వసాధారణం కానీ.. ఆ ధాన్యం ప్రాణాలు తీస్తే.. మీరు విన్నది నిజమే.. రోడ్లపై ధాన్యంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో 12 మందికి పైగా మృత్యువాత పడ్డారంటే.. పరిస్దితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఆర బెట్టిన ధాన్యం వల్ల వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతుండటంతో.. ఓ గ్రామ పంచాయతీ రోడ్లపై ధాన్యం ఆరపెట్టడాన్ని నిషేధిస్తూ తీర్మాణం చేసింది..పోలీసులు సైతం చట్టరీత్యా నేరం అంటూ కేసులు నమోదు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా రహదారులు ధాన్యం రాశులతో నిండిపోయాయి. ఏ రహదారి వెంట వెళ్లిన కిలో మీటర్ల కొద్ది ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. వాహనాలు తిరిగే రోడ్లపై.. వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరి ప్రాణాలు గాల్లో కలుస్తుంటే.. మరికొందరు తీవ్ర గాయాలతో శాశ్వత వైకల్యాన్ని పొంది మంచానికి పరిమితం అవుతున్నారు. రైతులకు కల్లాలు లేకపోవడం వల్ల.. జాతీయ  రాష్ట్ర  సర్వీసు రోడ్లపై కొంత మంది రైతులు తాము పండిస్తున్న ధాన్యం ఆరబెట్టడం సర్వసాధారణం. కానీ అలా ఆరబెట్టిన ధాన్యం వల్ల వాహనాలు అదుపు తప్పి.. ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో వడ్ల కుప్పలతో 12 మందికి పైగా వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ధాన్యం కుప్పలతో ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన ఆలూరు మండలం పిప్రి గ్రామస్తులు.. రోడ్లపై వడ్లు ఆరబోయడాన్ని నిషేధించారు. ఈ మేరకు పాలక వర్గం తీర్మాణం సైతం చేసింది. రైతులు ఎవరూ తమ పంట ఉత్పత్తులు.. రోడ్ల పై ఆరపెట్టొద్దని హుకూం జారీ చేశారు. తీర్మాణం ఉల్లంఘిస్తే.. జరిమానా వసూలు చేస్తామని చెబుతున్నారు. ఐతే రైతులు సైతం గ్రామ పంచాయతీ తీర్మాణానికి కొందరు రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారు. పిప్రి గ్రామంలో ఏ ఒక్క రైతు రోడ్లపై ధాన్యం ఆరపెట్టకుండా.. తమ పొలాల్లోనే ఆరబెట్టుకుంటుండటం గమనార్హం… రైతులకు కల్లాలు నిర్మించేందుకు సైతం ఆ గ్రామస్తులు కృషి చేస్తున్నారు…

 

Grain on the road.. life in the air
Grain on the road.. life in the air

 

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ఇప్పటి వరకు 12 మందికి పైగా మృతి చెందగా.. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలతో శాశ్వత వైకల్యాన్ని పొంది మంచానికి పరిమితం అవుతున్నారు. ఈ కారణంగా పోలీసులు సైతం ధాన్యం రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో రైతులపై కేసులు సైతం నమోదు చేశారు పోలీసులు. ఆరబెట్టిన ధాన్యం కారణంగా ఎవరైనా మరణిస్తే సంబంధిత యజమానిపై ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇటీవల బోధన్  ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు..

కొనుగోలు కేంద్రాల వద్ద స్థలాలు లేకపోవడం వల్ల.. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నారు. కొనుగోళ్లలో జాప్యంతో రోజుల తరబడి రోడ్లపైనే వడ్లు ఉంటున్నాయి. ప్రభుత్వం రైతులకు కల్లాలు నిర్మించి ఇస్తే.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేని పక్షంలో ఓ వైపు గ్రామ పంచాయతీల ఆంక్షలు మరో వైపు పోలీసుల చర్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి.. రైతులకు కల్లాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..లేని పక్షంలో ప్రత్యామ్నయ స్థలం చూపాల్సిన అవసరం ఉంది.