. ముగ్గు పోసిన వీడీసీ
ధర్పల్లి, బతుకమ్మ: విద్యాశాఖ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ముగ్గుపోసిన ఘటన ధర్పల్లి మండలం వాడిలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఐదేళ్ల కాలంలో సర్పంచ్, నాయకులు పనులు చేపట్టేందుకు చొరవ చూపలేదు.
ప్రాథమిక పాఠశాల ఆవరణలో గతంలో అంగన్ వాడి భవన నిర్మాణ పనులు చేపట్టగా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని కూల్చివేసి పదవీకాలం ముగిసే ముందు రోజున గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుక ప్రయత్నించగా యూత్ నాయకులు, గ్రామస్తులు వ్యతిరేకించారు. దీనిపై ఐసీ డీ ఎస్ అధికారులు సీరియస్ అయ్యారు. అనంతరం ఎంపీడీవో స్థలాన్ని పరిశీలించేందుకు రాగా గ్రామస్తులు మళ్లీ అభ్యంతరం తెలిపారు.
అయితే వరుస సెలవులు ఉన్న సమయంలో వీడీసీ సభ్యులను ముందు పెట్టి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం సోమవారం ఇద్దరు ముగ్గురు కలసి ముగ్గు పోయడం వివాదానికి దారి తీసింది. గ్రామానికి సంబంధించిన రెండు ప్లాట్లు ఉండగా కావాలని ఇక్కడే భవన నిర్మాణం చేపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ సైతం పాఠశాల స్థలంలో జీపీ భవన నిర్మాణాన్ని వ్యతిరేకించారు. పాఠశాల ప్రాంగణాన్ని కాపాడి వేరే చోట జీపీ భవనాన్ని నిర్మించాలని యువకులు, గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, తనకు గంట ముందు ఫోన్ ద్వారా విషయం తెలిసిందని, సెలవు రోజు కావడంతో రాలేక పోయానని అన్నారు. గతంలో ఎంపీడీవో పర్మిషన్ ఇవ్వక పోవడంతో పనులు నిలిపివేశారని, ఈ విషయాన్ని స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
