. . . ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత అన్నారు. శుక్రవారం ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు అడివాల అనిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశలత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని, డాక్టర్లు, మందుల కొరత లేకుండా 24 గంటలపాటు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రేషన్ కార్డుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆశ లత హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత, జిల్లా అధ్యక్షురాలు అడివాల అనిత, ఐద్వా కమిటీ సభ్యులు శ్రీదేవి, అనిత, లలిత, సునీత, లక్ష్మి, సంగీత, సంతోషి, శ్రావ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.