- సిఎం వద్ద విద్యాశాఖ, యూనివర్సిటీ భూములు అమ్మడానికేనా?
- విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
- ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హెచ్ సీయు భూముల అమ్మకాల పై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలో గిరి రాజ్ డిగ్రీ కాలేజ్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో భూములను చదును చేస్తున్న జెసిబిల అడ్డుకోవడానికి భూములను రక్షించుకోవడానికి వెళుతున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అడ్డుకొని ఇష్టానుసారంగా వారిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. ప్రజా పాలనలో విద్యార్థులపై ఉక్కు పాదం మోపడం ఏంటని, ప్రభుత్వం యూనివర్సిటీ భూముల అమ్మకాలపై మొండిపట్టుకు పోకుండా యూనివర్సిటీలో ఉన్నతమైన ప్రమాణాలు, పరిశోధనలతో, నాణ్యమైన విద్యతో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన గుర్తింపు పొందని, భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తే వందలాది ఎకరాల భూమి అవసరం ఉంటుందని అన్నారు. యూనివర్సిటీ భూముల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యశాఖ పెట్టుకుని ఇలా యూనివర్సిటీ భూములు అమ్మడం సిగ్గు చేటని మండిపడ్డారు. భూములు అమ్మడానికే రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్నాడ అని, ప్రభుత్వ ఏడో గ్యారెంటీ యూనివర్సిటీ భూమి అమ్మడమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి విద్యార్థులు ఉండే యూనివర్సిటీలో వందలాది పోలీసులతో పాలన చేయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కదాని పోలీసుల పాలనగా మారిందని, వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాల నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, నగర సహాయ కార్యదర్శి నవీన్ కృష్ణ,నాయకులు వంశీ, శివాజీ ,రమేష్ ,తేజు మరియు తదితరులు పాల్గొన్నారు.