Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 6:23 pm Posted by : ramakrishna

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

 

. . . పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులలో చేర్పించాలి

 

. . . ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగుతోందని తెలిపారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ వారితో భేటీ అయ్యారు.

 

Government schools on par with private ones

 

 

తమ పిల్లలను ప్రైవేటు బడుల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల భారం ఎక్కువగా ఉండడమే కాకుండా, ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పిస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొనగా, ఈ విషయాలను వివరిస్తూ మిగితా వారిని కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, పదవ తరగతిలో 87 శాతం సగటు ఉత్తీర్ణత సాధించిన బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకుని చక్కటి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపుతున్నారని అన్నారు. ఇదివరకు పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుకుంటారనే భావన ఉండేదని, ప్రస్తుతం ఆర్ధిక స్థోమత కలిగిన వారు కూడా నాణ్యమైన విద్య కోసం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుండడం శుభ పరిణామమని అన్నారు.

 

Government schools on par with private ones

 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ తత్వాన్ని పెంపొందించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో విద్యా ప్రమాణాలు, బోధనను మెరుగుపరుస్తోందని, ఉపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలను పెంపొందేలా శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులతో పాటు అల్పాహారం, మద్యాహ్న భోజనం అందిస్తోందని అన్నారు.  బోర్గాం(పి) పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో, బడికి ఆనుకుని ఉన్న స్థలాన్ని సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థిని, విద్యార్థుల బోధనా సామర్ధ్యాన్ని పరిశీలించి, బహుమతులు అందజేశారు. బాలబాలికలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, మోపాల్ తహసిల్దార్ రేఖ, ఎం.ఈ.ఓ సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.

 

Government schools on par with private ones