Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 8:41 pm Posted by : ramakrishna

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు చేయాలి

  • లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని ఆదేశం
  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బ్లాక్ ప్లాంటేషన్లను పరిశీలించిన కలెక్టర్

 

భీమ్ గల్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం భీమ్‌గల్ మున్సిపాలిటీని ఆయన సందర్శించారు.పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని, లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతు న్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, మంజూరీలు కోరిన వారందరిని ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులకు మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీ కింద రూ.లక్ష రూపాయల వరకు రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు.తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణానికి వెచ్చించేలా నిశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని,నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్లు 400 చదరపు అడుగులకు తగ్గకుండా,600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని,ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇసుక సరఫరా వంటి తోడ్పాటును అందించాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున, బేస్మెంట్ లెవెల్ వరకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని అన్నారు. ఆయా దశల ఇళ్ల నిర్మాణాలను అనుగుణంగా లబ్దిదారుల ఖాతాలలో బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాను మళ్ళీ సమీక్ష జరిపే సమయానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పూర్తి స్థాయిలో పురోగతి కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సీజన్ లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ, పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, మూడు మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ ల కోసం వినియోగించాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పక్కాగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నిలువ నీరు ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబుషియా చేప పిల్లలు వదలాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని నివాస ప్రాంతాల్లో,వ్యాపార వాణిజ్య సంస్థలలో విధిగా డ్రై డే పాటించేలా చూడాలన్నారు. ఎక్కడైనా మలేరియా, విష జ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదు అయితే, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని,అవసరమైన వారికి చికిత్సలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం కలెక్టర్, భీంగల్ పట్టణంలోని బోయిగల్లి, బాపూజీనగర్ లలో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా గత సంవత్సరం మొక్కలు నాటిన బ్లాక్ ప్లాంటేషన్ ను తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఆగస్టు 14వ తేదీ లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

Government priority programs should be implemented