. . . 12 ఎకరాల ఊర చెరువు కబ్జా
. . . కొందాపూర్ లో అన్యాక్రాంతమైన 28 ఎకరాల పత్తరకుంట
. . . కనుమరుగైన 4 ఎకరాల గైని గుట్ట
. . . నిద్రమత్తులో రెవెన్యూ అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
యాడ జాగ దొరికితే ఆడ వేసేయ్ పాగా అన్న చందంగా మారింది కొందరు కబ్జాదారుల వ్యవహార శైలి. రుద్రూర్ మండలంలోని కొందాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు, పత్తర కుంట, చెరువు అన్యాక్రాంతమవుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎంక్వైరీల పేరుతో కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సర్వే నెంబరు 219 లో ఊర చెరువు 42 ఎకరాల 18 గుంటలు ఉండగా, సుమారు 12 ఎకరాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో కనుమరుగైపోయిందని గ్రామస్తులు తెలిపారు. సర్వే నెంబర్ 103లో పత్తరకుంట 28 ఎకరాల 15 గుంటల భూమి అన్యాక్రాంతమైపోయి గుంట భూమి లేకుండా కబ్జాదారులు మొత్తం కుంటానే మాయం చేశారన్నారు. సర్వే నంబర్ 141,142,143లోసుమారు 4 ఎకరాలు గైని గుట్ట కొండలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో కనుమరుగైపోయాయి. సర్వే నెంబర్ 309 లో 12 ఎకరాలు గతంలో ప్రభుత్వం పేద ప్రజల కోసం భూములు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చినా కబ్జాదారులు కబ్జా చేసుకొని యాదేచ్చగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కనిపిస్తున్న వారి వద్ద కేవలం పంపిణీ పత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలను చెరువు ప్రాంతంలోని బురదలో పూడ్చాల్సిన దుస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కనీసం దాహన సంస్కారాల కోసం కూడా గుంట భూమిని సైతం మిగిల్చకుండా ప్రభుత్వ భూములు పై కబ్జాదారులు గద్దల్ల వాలిపోయి కబ్జాలు చేసుకున్నారు. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగానికి ఉలుకు పలుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారే తప్ప కబ్జాదారుల పై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వ అధికారులు మారిన ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించడం లేదని, నిద్రమత్తులో మునిగి తేలుతున్నారని గ్రామస్తులు వాపోయారు. పాలకులు కూడా కనికరించడం లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినప్పుడల్లా విచారణ పేరుతో కాలయాపన చేస్తూనే వస్తున్నారు. ఇంత జరుగుతున్న కొందాపూర్ ప్రజల తరఫున గోంతెత్తె నాయకుడే లేడన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి కొందాపూర్ లో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
