- అక్షయ తృతీయకు ముందు బిగ్ షాక్
- సామాన్యుడికి అందనంత ఎత్తులో దూసుకెళ్తున్న బంగారం
హైదరాబాద్, బతుకమ్మ: బంగారం ధరలు అదుపు లేకుండా పరుగులు పెడుతున్నాయి. కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా, భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన పసిడి, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారుతోంది. తాజాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం (10 గ్రాములు) ధర ఏకంగా రూ.1,02,062కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. లక్ష రూపాయల గీతను దాటడం, బంగారం మార్కెట్‌లో పెను సంచలనంగా మారింది. అక్షయ తృతీయ ముందు ధరలు ఈ స్థాయిలో పెరగడం భారత దేశ మధ్య తరగతి ప్రజలను భయపెడుతోంది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న ధరలు చూస్తుంటే, సామాన్యుడు తులం బంగారం కొనడం కష్టసాధ్యంగా మారింది. చిన్న చిన్న ఆభరణాలు కొనాలన్నా వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం కొనాలనే కలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మొత్తం మీద, పసిడి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ఇంతలా పెరగడానికి అమెరికాలో కొనసాగుతున్న అనిశ్చితి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులకు ఇది లాభదాయకంగా ఉన్నప్పటికీ, ఆభరణాలుగా కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు మాత్రం బంగారం మరింత దూరమవుతోంది. ఈ ధరల పెరుగుదల ఎక్కడ ఆగుతుందో చూడాలి.
- వెండి కూడా అదే దారిలో:
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర లక్ష రూపాయల మార్కును అధిగమించి రూ.1,01,000 వద్ద ట్రేడవుతోంది.
ఆల్ టైమ్ హై రికార్డును చేరిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2,750 పెరిగి రూ.లక్షకి చేరిన తులం బంగారం ధర.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,350… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,900.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,000.