Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 1:50 pm Posted by : ramakrishna

విద్యాశాఖలో ‘గ్లోబల్’ అవినీతి

. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా దండుకున్న సంస్థ

. చర్యలు తీసుకోకుండానే చేతులెత్తేసిన విద్యాశాఖ

. మళ్లీ అనుమతుల కోసం ఫౌండేషన్ ప్రయత్నాలు

నిజామాబాద్, బతుకమ్మ: విద్యాశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుని నిండా ముంచిన గ్లోబల్ ఫౌండేషన్.. మళ్లీ ఉద్యోగాల భర్తీ అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏకంగా ప్రభుత్వంలో భాగమైన విద్యాశాఖ పేరుతో ఓ ప్రైవేట్ ఫౌండేషన్ డబ్బులు వసూలు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా చేతులెత్తడం వెనుక ముడుపుల వ్యవహారం ఉందనే  ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ ఫౌండేషన్  పై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ వెనుకంజ ఎందుకు వేస్తోందని  పలువురు  ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలలుగా బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వారిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇదిలా ఉండగా ఉద్యోగాల భర్తీ అంటూ గ్లోబల్ ఫౌండేషన్ మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

చర్యలకు వెనుకంజ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, బోధకులు, ఇతర సహాయకులను తామే నియమించి వేతనాలు అందిస్తామని గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ గతేడాది జిల్లా విద్యాశాఖ అనుమతి పొందింది. ఆ తరువాత 23 మందిని ఆయా పాఠశాలల్లో నియమించింది. అయితే ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ.2లక్షల  నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసింది. ఇదే అదునుగా భావించిన నిర్మల్ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి గ్లోబల్ ఫౌండేషన్ పేరిట నకిలీ నియామక పత్రాలను సృష్టించి అతను మరో పది మంది వద్ద రూ.3లక్షల చొప్పున వసూలు చేశారు. జిల్లాలో ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి సుమారు 23 మంది మోసపోయారు. ఈ వ్యవహారం గత జూలై నెలలో వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి డీఈవో దుర్గాప్రసాద్ గ్లోబల్ ఫౌండేషన్ ను జిల్లా విద్యాశాఖ నుంచి రద్దు చేశారు. ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. అనంతరం బాల్కొండ, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేయగా రాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. గ్లోబల్ ఫౌండేషన్ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో అప్పటి డీఈవో దుర్గాప్రసాద్ బదిలీ కాగా విచారణ అటకెక్కి ఈ కేసు మూలనపడింది.  బాధితులు మాత్రం తాము చెల్లించిన డబ్బులు ఇప్పించాలని జిల్లా విద్యాశాఖ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

విద్యాశాఖ అధికారుల కుమ్మక్కు

గ్లోబల్ ఫౌండేషన్ జిల్లాకు వచ్చింది మొదలు విద్యాశాఖ అనుమతులు, ఉద్యోగాల భర్తీ అంటూ హడావుడి, నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూలు, కేసులు, ఆ తరువా ఈ వ్యవహారాన్ని అటకెక్కించడం వరకు అన్ని దశల్లో ఫౌండేషన్ ప్రతినిధులతోపాటు విద్యాశాఖలోని కొందరు అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ అధికారులు ప్రస్తుతం గత వ్యవహారిన్న బయటికి రానీయకుండా గ్లోబల్ ఫౌండేషన్ కు మళ్లీ అనుమతులు ఇప్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు అనుమతుల కోసం హైదరాబాద్ లో విద్యాశాఖ ఉన్నతాధికారులు, పలువురు మంత్రులను కలిసి గత నెల రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారి అండదండలు అందిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్లీ అనుమతి కోసం ప్రయత్నాలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బాధితులకు డబ్బులు అందించలేక ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాకుడు హైదరాబాద్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తూ అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని సామగ్ర శిక్ష విభాగంలోని అధికారికి రూ.5లక్షల ముడుపులు అందించినట్లు తెలిసింది. బాధితులకు మాత్రం డబ్బులు ఇప్పించడం లేదు. అధికారులు, గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకుల కారణంగా నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే దీనిపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.