Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 5:35 pm Posted by : ramakrishna

అర్హులైన వారికే జీజీహెచ్ డైట్ టెండర్ ఇవ్వాలి

  • సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అవినీతి ఆరోపణలు లేని, అర్హులైన వారికే జీజీహెచ్ డైట్ టెండర్ ఇవ్వాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి   డైట్ టెండర్ పై అధికారుల వైఖరిని నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కమిటీ ఆధ్వర్యంలో  గురువారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు భోజనాన్ని అందించే డైట్ టెండర్ పై గత కొద్దిరోజులుగా వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. పాత టెండరుదారుడిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇదివరకు కొనసాగిన ప్రభుత్వ ఆసుపత్రి డైట్ టెండరుదారుడు నాసిరకం భోజనం పెట్టాడని, నిధులను స్వాహా చేశాడని ఆరోపణలు ఉన్నాయన్నారు. అయినా ఎలాంటి విచారణ గాని, నిధుల రికవరీ గాని జరగలేదన్నారు. మళ్లీ పాత టెండర్ దారుడికే అప్పగించాలనుకోవడంలో అధికారుల వైఖరిపై ఉన్నతాధికారులు స్పష్టత నివ్వాలన్నారు.  పేషంట్లకు నాసిరకం భోజనం పెట్టడం, తప్పుడు రికార్డులతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరగడం ప్రభుత్వ ఆసుపత్రిలో రివాజుగా మారిందన్నారు. ఈ పరిస్థితులను మార్చాలన్నారు. అవినీతి ఆరోపణలు లేని, అర్హులైన వారికే టెండర్ దక్కేలా చూడాలని, రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు కే.సంధ్యారాణి, కే.గణేష్, టి.విటల్, అమూల్య, లలిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.