. . . ముక్కుపిండి వసూలు చేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్
రుద్రూర్, బతుకమ్మ :
గ్యాస్ ధరలు, సరఫరా, ఏజెన్సీల పనితీరు తదితర అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి డెలివరీ చేయడానికి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని రుద్రూర్ గ్రామ వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ ధర 990 రూ. ఉన్నప్పటికీ దిక్షిత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అదనంగా 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ ధరను గ్యాస్ బుక్ లో వ్రాయడం లేదు. దీంతో గ్యాస్ వినియోగదారులకు బండ బాదుడు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసుకున్నాక గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది సిలిండర్‌ను ఇంటికి తీసుకొచ్చినపుడు నిర్ణీత రుసుం కంటే అదనంగా రూ.30 నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నట్లు గ్యాస్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సరఫరా చేయాలి. వినియోగదారులు చెల్లించే బిల్లులోనే ఇందుకు సంబంధించిన ఛార్జీలు కలిపి ఉంటాయి. నిబంధనల ప్రకారం 30 కిలోమీటర్ల లోపు ఉంటే పది రూపాయలు 30 కిలోమీటర్లు దాటితే 15 రూపాయలు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ డెలివరీ పై ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని పదేపదే అధికారులు చెబుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఈ విషయమై గ్యాస్ నిర్వాహకులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఏజెన్సీల సహకారంతోనే డెలివరీ బాయ్స్ ఈ మొత్తం వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.