Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 4:51 pm Posted by : ramakrishna

దేశంలో గంగా జమునా తహజీబ్ వర్థిల్లాలి

 

. . . ప్రతి ఇంటిలో సుఖ సంతోశాలు నిండాలి

 

. . . కుల గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి

 

. . . కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి పాటు పడాలి

 

. . . బక్రీద్ వేడుకల్లో మహ్మద్ షబ్బీర్ అలీ

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

గంగా జమునా తహజీబ్ లా భిన్నత్వంలో ఏకత్వం అనే సాంప్రదాయంతో భారతదేశం ఎంతో కాలంగా వర్ధిల్లుతోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. పవిత్రమైన బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి పట్టణంలోని కోర్టు ఆవరణలో గల ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈద్-ఉల్-అజ్హా పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటిలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సౌభ్రాతృత్వం నిండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ, ఐక్యత, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన (సెన్సస్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కుల గణన అత్యంత కీలకమని, దీనిపై స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.

 

Ganga-Jamuna Tehzeeb should flourish in the country.

 

బీజేపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను అక్రమంగా తొలగిస్తూ దేశ మనుగడకే ప్రమాదం తెచ్చేలా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలపై ఒత్తిడి, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి, ‘ఎస్ఐఆర్’ పేరుతో లక్షలాది ప్రతిపక్ష ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాలే ఉదాహరణలన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారం దక్కించుకోవడం కోసం ఏకంగా 95 లక్షల ఓట్లను తొలగించారని, అలాగే బీహార్ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఓట్లను తొలగించి అక్రమంగా ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. మతతత్వ బీజేపీ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రేపి, సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండి, తమ వివరాలను అందిస్తూ ఓటు హక్కును తప్పకుండా నమోదు చేసుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆవును దేశ జాతీయ జంతువుగా ప్రకటించాలని దేశ ముస్లిం మత పెద్దలు కోరగా, షబ్బీర్ అలీ దానికి సంపూర్ణ సమర్థన తెలుపుతూ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ లౌకికత్వానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ, భారతీయులందరూ ఒకటే. కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

 

Ganga-Jamuna Tehzeeb should flourish in the country.