. . . సిబ్బందిపై కాల్పులు జరిపి దోపిడి
. . . కిలో బంగారు నగల చోరి
కరీంనగర్, బతుకమ్మ :
ప్రముఖ నగల వ్యాపార సంస్థ పీఎంజే జ్యువెలరీలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లో గల పీఎంజే జ్యువెలరీ బోటిక్ కేంద్రంలోకి ఐదుగురు దొంగలు కస్టమర్లుగా వచ్చి చొరబడ్డారు. అక్కడ ఉన్న కస్టమర్లను, సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలను దోచుకున్నారు. ఈ ప్రయత్నంలో అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిపై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆగంతకుల కాల్పుల్లో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. మేనేజర్ ను బందీగా పెట్టుకుని అతని ద్వారా సిబ్బంది చేత లాకర్ ను తెరిపించి కిలోకు పైగా బంగారు నగలను ఎత్తుకుని పరారీ అయ్యారు. ఉదయం 10:30 గంటల సమయంలో సినిమా ఫక్కీలో చోరి చేసిన ఆగంతకులు రెండు బైక్ లపై పరారీ అయ్యారు.
. . . ముందుగా రెక్కీ నిర్వహించి చోరికి పాల్పడిన ముఠా
పీఎంజే జ్యువెలరీలో ఐదుగురు అగంతకులు దర్జాగా సిబ్బందిపై కాల్పులు జరిపి నగల చోరి ఘటన కలకలం రేపింది. ఎక్కడైనా దొంగలు తమ మొఖం కనిపించకుండా ముసుగులు ధరించి చోరి చేయడం కనిపిస్తుంది. కానీ సీసీ కెమెరాలున్నాయని లెక్క చేయకుండా ఐదుగురు బ్యాగులతో అందులో తుపాకులను ఉంచుకుని నేరుగా కస్టమర్ల మాదిరిగా వచ్చి చోరికి పాల్పడడం, అడ్డుకున్న సిబ్బందిపై కాల్పులు జరుపడం వారి తెగువను చూపుతుంది. పోలీసులు అగంతకుల ముఠాను అంతర్ రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఉదయం వేళ షోరూం తెరిచి లాకర్ లో నగలు సదురుతుండగానే ఈ ఘటన జరుగడంతో చోరికి ముందుగానే అక్కడున్న పరిస్థితులను తెలుసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారు దర్జాగా దొంగతనం చేసి నగలను తీసుకుపోతున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజిలో లభ్యమయ్యాయి. అంతేగాకుండా రెండు బైక్ లపై రాజీవ్ రహదారి మీదుగా వెళ్లిన పుటేజి కూడా పోలీసులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అదీ కూడా హైదరాబాద్ తర్వాత ఇతర ప్రాంతాల్లో నగల షాప్ లను దొంగల ముఠా టార్గెట్ చేయడం కలవరానికి గురి చేసింది.
. . . దొంగల ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జ్యువెలరీ షాప్ లో దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యుల ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును పోలీసు శాఖ ప్రకటించింది. సీసీటీవీ పుటేజిల ఆధారంగా వారు గతంలో తెలంగాణలో చోరికి పాల్పడి ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశోధిస్తున్నారు. ఘటన స్థలంలో దొరికిన వేలిముద్రలు, ఆనవాళ్ళ ప్రకారం దొంగల ముఠాను పట్టుకునేందుకు 12 టీంలను ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ గౌస్ అలాం ప్రకటించారు. అందులో భాగంగా స్థానికంగా కరీంనగర్ పట్టణంలోని సీసీటీవీ పుటేజిలతో పాటు రాజీవ్ జాతీయ రహదారిపై ఉన్న కెమెరాలను పరిశీలించారు. నగల దుకాణంలో దొంగతనం చేసిన తర్వాత సంబంధిత ముఠా బైక్ లపై పరారీ అయిన ఇతర ప్రాంతాల్లో వేరే వాహనాల్లో వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జాతీయ రహదారితో పాటు ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.