Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 9:41 pm Posted by : ramakrishna

గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన చోరీల ముఠా

 

. . . 12 కేసుల ఛేదన

 

. . . భారీగా చోరీ సొత్తు స్వాధీనం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలు, మొబైల్ ఫోన్ దోపిడీలు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడిన ఇద్దరు ముఠా సభ్యులను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, మొత్తం 12 కేసులను ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం, కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారం అందడంతో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సాయి కృష్ణ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించింది. విచారణలో నిందితులు తలిపిరియా రూబిన్ సింగ్ అలియాస్ రాసింగ్ (23), మంగళ్ సింగ్ (21) గా గుర్తించారు. వీరిద్దరూ రాజీవ్ నగర్ కాలనీకి చెందినవారే. గంజాయి, మద్యం వ్యసనాలు మరియు ఇతర ఖర్చుల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సంచరిస్తూ మోటార్ సైకిల్ చోరీలు, మొబైల్ ఫోన్ దోపిడీలు, పర్సుల దొంగతనాలు, పట్టర్ లిఫ్టింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి ఆరు మోటార్ సైకిళ్లు, 23 మొబైల్ ఫోన్లు, రెండు డెస్క్‌ టాప్ కంప్యూటర్లు సహా పెద్ద మొత్తంలో చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా చోరీ సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్లుగా ముజాహిద్ (25), రాజేందర్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన మొబైల్ ఫోన్లను సాఫ్ట్‌ వేర్ సహాయంతో అన్‌లాక్ చేయించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు కామారెడ్డికి చెందిన సమీర్, శివ అనే వ్యక్తుల సహకారం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. కేసులను విజయవంతంగా ఛేదించి, వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న కామారెడ్డి సీసీఎస్, టౌన్ పోలీస్ బృందాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాలను ఎల్లప్పుడూ సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడంతో పాటు స్టీరింగ్ లేదా వీల్ లాక్‌లను ఉపయోగించాలని సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లలో స్క్రీన్ లాక్, ట్రాకింగ్ వంటి భద్రతా సదుపాయాలను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల వినియోగం లేదా నేర కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.