Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 2:01 pm Posted by : ramakrishna

అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ కాయిల్స్  దొంగల ముఠా అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ :  అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ దోపిడీ ముఠాను ఇందల్వాయి వద్ద పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు… ఆదివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.  గత సంవత్సరం కాలం నుంచి నిజామాబాద్ జిల్లా లోని ఇందల్వాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవీపేట్, వర్ని, మండలాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసంచేసి అందులోని కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారు.  అంతరాష్ట్ర దొంగల ముఠా లోని ఏడుగురు సభ్యులలో నుంచి ఐదుగురిని శనివారం అరెస్టు చేశామని, అలాగే  దొంగలించిన కాపర్ కాయిల్స్ ను కొన్న ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామన్నారు.  నిందితులు నిజామాబాద్ జిల్లా లోని పై పోలీస్ స్టేషన్ పరిధిలలో 101 ట్రాన్స్ ఫార్మర్ లను పగులగొట్టి అందులో ఉన్న కాపర్ కాయిల్స్ ను చోరీ చేయగా 44 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట రెడ్డి ఆధ్వర్యంలో  స్పెషల్ టీం లను నియమించగా,  శనివారం  ఇందలవాయి మండల పరిధిలో గన్నారం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి నిందితులను పట్టుకున్నారు.  మహారాష్ట్రకు చెందిన  తుంబారె సుధాకర్,  ఉత్తర ప్రదేశ్ కు చెందిన హర్బీర్ శర్మ, ఏపీ కి చెందిన అలీ మహమ్మద్, యడాల వెంకటేశ్వర్లు , మహబూబ్ నగర్ కుచెందిన శానపల్లి రవీందర్ అనే నిందితులను పట్టుకున్నారు. అలాగే కాపర్ కాయిల్స్ కొనుగోలు చేసిన వ్యాపారులు  లింగప్ప, గాజుల శ్రీ శైలం, మహమ్మద్ హైదర్ అలీ లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి 40 కేజీల కాపర్ కాయిల్స్, రూ. 5 లక్షల 50 వేల నగదు,  రెండు స్కూటీ లు, 6 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరుపర్చారు.  ఈకేసు ఛేదనలో  కీలకంగా వ్యవహరించిన ఏసీపీ  రాజ వెంకట రెడ్డి డిచ్ పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్, డిచ్ పల్లి ఎస్సై షరీఫ్, జక్రాన్ పల్లి ఎస్సై మహేష్,  సిబ్బందిని సీపీ అభినందించారు.