- పట్టణ సిఐ ఎం.అశోక్
బాన్సువాడ, బతుకమ్మ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బాన్సువాడ టౌన్ సిఐ యం. అశోక్ కోరారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమం సందర్భాలను పురస్కరించుకుని ఆదివారం నాడు టౌన్ సిఐ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి నిర్వాహకులకు పలు ముఖ్య సూచనలు చేశారు.మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తక్షణమే స్పందించడానికి, పోలీస్, మున్సిపల్, విద్యుత్ మరియు ఇతర శాఖల అధికారుల నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.భక్తుల రద్దీని నియంత్రించడానికి మరియు మహిళల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. అలాగే, పోలీసులు తెలిపిన సూచనలను మండపంలో ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శించాలన్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి, ప్రతి మండపం వద్ద కనీసం ఒక్కటైనా సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని సూచించారు.ఫేక్ వార్తలను లేదా విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని, అలాంటి సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలని, డీజేల వాడకం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు.పోలీస్ శాఖ ఇప్పటికే పంపించిన లింక్‌లో మండప వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేయదలచిన తేదీ మరియు ప్రాంత వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగానే ట్రాఫిక్ నియంత్రణ మరియు బందోబస్తు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.