- కామారెడ్డి జిల్లాలో 24 గంటల పాటు కొనసాగిన యాత్ర
- నిజామాబాద్ లో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో
- భారీ విగ్రహాలు గంగఒడికి
- చిన్న విగ్రహాలు చెరువులు, కుంటలు, బావుల్లో నిమజ్జనం
నిజామాబాద్, బతుకమ్మ : 9 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణపతి విగ్రహాల నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. కామారెడ్డి జిల్లాలో ప్రతి యేడాది మూడు రోజుల పాటు జరిగే నిమజ్జన వేడుకలు రెండు రోజులకు 24 గంటల పాటు జరిగాయి. కామారెడ్డి పట్టణంలోని శోభాయాత్రను శుక్రవారం రాత్రి ధర్మశాల వద్ద జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. శోభాయాత్ర కామారెడ్డి శివారులోని టెక్రియల్ చెరువుకు, పెద్ద చెరువుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే శోభాయాత్రను చంద్రగ్రహణంతో పాటు శాంతిభద్రతల సమస్యల కారణంగా 24 గంటలకు తగ్గించారు. శుక్రవారం రాత్రి ప్రారంభమైన శోభాయాత్ర శనివారం రాత్రి వరకు కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి, ఆర్మూర్, భీంగల్, డిచ్ పల్లి, నందిపేట్ ప్రాంతాలలో శోభాయాత్ర వేడుకలు కన్నుల పండుగా జరిగాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు జండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బలో ప్రారంభమైన శోభాయాత్ర వినాయక్ నగర్ లోని గణపతి బావుల వరకు సాగింది. సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన శోభాయాత్ర రథంలో నిమజ్జనం కోసం వందల విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. పోలీసు శాఖ డీజేలపై నిషేదం విధించడంతో బ్యాండ్ లతో, మేళతాళాలతో తరలించారు. నగరంలోని గోల్ హనుమాన్ వద్ద సంస్కార భారతి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ వేడుకలను సాంప్రదాయబద్దంగా నిర్వహించిన వారికి సన్మానించారు.

ఉమ్మడి జిల్లాలో జరిగిన గణేష్ శోభాయాత్రలను పోలీసు బాసులు స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో శోభాయాత్రను పర్యవేక్షించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘాను జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రారంభించిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శోభాయాత్రను కమిషనర్ సాయిచైతన్య, డీసీపీ బస్వారెడ్డి, సబ్ డివిజన్ ల పోలీసు అధికారులు పర్యవేక్షించారు. 8 ఫీట్ల లోపు గణపతులను ఎడపల్లి, జాన్కంపేట్ మీదుగా బాసర గోదావరికి తరలించారు. 8 ఫీట్లకు పైగా ఎత్తున గణపతులను జన్నెపల్లి మీదుగా నవీపేట్, బాసరకు నగరంలోని గణపతులను నందిపేట్ ఉమ్మెడ బ్రిడ్జి వద్దకు తరలించి నిమజ్జనం చేశారు.
- భక్తజనం సందోహం మధ్య నిమజ్జన వేడుకలు
ఈసారి గణేష్ నిమజ్జన ఉత్సవ వేడుకలు పండగ వాతావరణంలో జరిగాయి. పోలీసు శాఖ డీజేలను నిషేదించడంతో బ్యాండ్ లు, మేళ తాళాలతో నిర్వహించారు. పలు ప్రాంతాల్లో భక్తి శ్రద్దలతో భజనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్రకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంఘాల సభ్యుల కోలాటంతో పాటు కంజర్ల ఆధ్వర్యంలో ఆధ్యాంతం భక్తి శ్రద్దలతో దేవుని పాటలతో ముందుకు సాగింది. నగరంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో నిమజ్జన యాత్రకు ధార్మిక శోభ సంతరించుకుంది. ప్రతి యేటా మాదిరిగానే ఇతర మతస్తులు నిమజ్జనం సందర్భంగా భక్తులకు పండ్లు, పులిహోర, వాటల్ బాటిళ్ళు సరఫరా చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు.
