గాంధారి, బతుకమ్మ : గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎంపీ సురేష్ షెట్కార్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్మన్ గా ఆకుల లక్ష్మణ్, గాంధారి మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎంఎల్ఏ మదన్ మోహన్ మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంది రాష్ట్రంలోని ఉన్నతమైన స్థాయికి రావాలని కోరారు. కొద్దీ రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను కార్యకర్తలే ఎమ్మెల్యే లు గా మారి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని తెలిపారు.

రుణమాఫీ పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి రుణ మాఫీ వస్తుందని అన్నారు. గాంధారి మండలానికి క్రీడా మైదానం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 10 యేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ గాంధారి మండలం కోసం ఏం చేసింది..? నాయకులు సంపాదించుకోవడం తప్ప మండలాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కాలం లోనే బుగ్గ గండి వద్ద ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. కాటేవాడి రోడ్డు, కర్ణం గడ్డ తండా రోడ్డు, ముఖ్యంగా గాంధారి మండలం పంటలతో కళకళలడాలని కాటేవాడి, గుజ్జుల్ (పాకేజీ 22) పూర్తి కావాలని నిత్యం శ్రమిస్తున్నామని తెలిపారు.

సర్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే నా నెల జీతాన్ని ఇచ్చి వారికి ఇల్లు కట్టిస్తున్నానని పేర్కొన్నారు. అది గిట్టని కొందరు దద్దమ్మలు కాకి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధారి మండలం లో ఉన్న కాయితీ, ఎస్ టీ సోదరులకు మంచి పదవులు ఇప్పిచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే గాంధారి మండల కేంద్రంలో 40 లక్షలతో సీసీ, డ్రైనేజీ పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. అందరూ నాయకులు కలిసి కట్టుగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపియ్యాలని సూచించారు.
