. . . ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరంపై మెరుపు దాడి
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు, అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే అది అప్పుల ఊబిలోకి నెడుతూ, చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఇటువంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగమ్మయిపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 20,160 నగదుతో పాటు ఒక మొబైల్ ఫోన్, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.