Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2024, 7:39 pm Posted by : ramakrishna

భవిష్యత్ కార్యకర్తలదే..

Future activists..

. పని చేసుకుంటూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయి

. 27 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా పోటీ చేశా

. 38 ఏళ్లలో అనేక కష్టాలు చూశా.. పార్టీ పగ్గాలు చేపడతానని కలలో కూడా ఊహించలేదు

. సన్మాన సభలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్, బతుకమ్మ:  ఓ సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడమనేది కాంగ్రెస్ లోనే సాధ్యమని, భవిష్యత్ కార్యకర్తలదేనని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఘనస్వాగతం పలికాయి. బోర్గాం(పీ) చౌరస్తా నుంచి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు భారీ స్వాగతం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మహేశ్ కుమార్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, రాష్ర్ట మంత్రులు సైతం పాల్గొన్నారు.

సన్మాన సభలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రసంగించారు. రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయని, తన రాజకీయ జీవితంలో 38 ఏళ్లలో ఎన్నో కష్టాలు భరించానని, కష్టానికి వడ్డీతో కలిపి పీసీసీ పదవి దక్కిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని తాను కలలో కూడా ఊహించలేదని, తల్లిదండ్రుల ఆశీర్వాదం తనకు తోడైందన్నారు. డీఎస్ మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన తనకు ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారన్నారు. డీఎస్ తో విబేధాలున్నప్పటికీ ఆయన తనకు రాజకీయ గురువని స్పష్టం చేశారు. 27 ఏళ్లకే డిచ్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశానని తెలిపారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. పీసీసీ పదవికి మధుయాష్కీతోపాటు లక్ష్మణ్ కుమార్ పోటీపడ్డారని, ఎవరికి బాధ్యతలు అప్పగించినా హైకమాండ్ మాటను జవదాటేవారిమి కాదని స్పష్టం చేశారు. తనకు ఊహ తెలియని రోజుల్లో ఇందిరా గాంధీతో ఫోటో దిగానని, ఐదుగరు గాంధీలతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.

దళిత బిడ్డకు ఏఐసీసీ, బీసీకి పీసీసీ..

కాంగ్రెస్ లో  కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి గుర్తు చేశారు. మల్లిఖార్జునఖర్గేకు ఏఐసీసీ బాధ్యతలప్పగించి దళితులపై కాంగ్రెస్ కు ఉన్న ప్రేమను మరోసారి రుజువు చేసిందన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీనైనా తనకు పీసీసీ ఇచ్చిందన్నారు. అజారుద్దీన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్, షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవులను ఇచ్చి కాంగ్రెస్ ముస్లింలను గౌరవించిందన్నారు.

ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి

తాను పీసీసీ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా ప్రజలకు తనపై ఎక్కువ అంచనాలు ఉంటాయని, అందుకు అనుగుణంగా జిల్లాలో అభివృద్ధిని పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీములో మంచి మంత్రులు ఉన్నారని, జిల్లాపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. జిల్లాలో కాళేశ్వర్ ప్యాకేజీ 21 పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, జిల్లాకు మరో మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రులను కోరారు.

దేవుళ్ల పేరుతో రాజకీయ చేయలేదు

గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు.  తామెప్పుడూ దేవుళ్ల పేరు చెప్పి రాజకీయాలు చేయలేదన్నారు. మతాలు, కులాల పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. తాము కూడా శ్రీరాముని భక్తులమేనని, మా ఇంట్లో కూడా రోజూ పూజ చేస్తామన్నారు. శ్రీరామునికి, బీజేపీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 2014లో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ.. రెండు కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు ఎటుపోయాయని ప్రశ్నించారు.

ఫామ్ హౌస్ ల్ కేసీఆర్ ఎంజాయ్

పదేళ్ల కాలంలో రాష్ర్టాన్ని అప్పుల కుప్ప చేసిన కేసీ ఆర్.. అక్రమ సంపాదనతో ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పటి వరకు ఆయన ప్రజల్లోకి రావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉందంటే అందుకు ప్రజలే కారణమని, పదేళ్ల కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు.

Future activists..