Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:48 pm Posted by : ramakrishna

తెలంగాణలో సామాజిక న్యాయానికి మరింత బలం

 

. . . రెండు కీలక కమిటీల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు చోటు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణలో సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ప్రభుత్వం రెండు కీలక కమిటీలలో సభ్యునిగా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖ ఆదివారం ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.) జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై ఇటీవల వెలువరించిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సభ్యత్వం కల్పించారు. ఎస్సీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై ఆయనకు ఉన్న అవగాహన కమిటీ పనితీరుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఉన్నత విద్యా సంస్థల్లో కుల, సామాజిక గుర్తింపు ఆధారంగా జరిగే వివక్షను నిరోధించేందుకు ప్రతిపాదిత “రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నిరోధక) బిల్లు–2026” రూపకల్పనకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీలోనూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సభ్యునిగా నియమించారు. ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన శాసనపరమైన అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పరిపాలనలో కేంద్రబిందువుగా నిలిపిందని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పన, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగబద్ధమైన, న్యాయసమ్మతమైన సిఫారసులు చేయడానికి కమిటీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎలాంటి వివక్షకు గురికాకుండా చట్టపరమైన రక్షణ కల్పించేలా రోహిత్ వేముల బిల్లును ఆదర్శవంతమైన చట్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతుందని ఆయన అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఈ రెండు కీలక కమిటీల్లో సభ్యత్వం కల్పించడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌ జెండర్‌ల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఆయన పాత్ర మరింత విస్తరించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయం సాధనలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Further strengthening social justice in Telangana